వైసీపీ-టీడీపీ-తెరాస అమిత్ షా కి సలాం చేయాల్సిందే

Sunday, August 11th, 2019, 06:17:51 PM IST

ప్రాంతీయ పార్టీలను ఎలా చేతిలో ఉంచుకోవాలి, వాళ్ళు తోకలు జాడించకుండా ఏ విధంగా చేసుకోవాలి అనేది మోదీ-షా ద్వయానికి తేలినంతగా మరో నేతలకి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో బీజేపీ పోషిస్తున్న పాత్ర చూస్తే హౌరా అనిపించకమానదు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడా బీజేపీ తో జత కట్టలేదు, కానీ బీజేపీ చేసే ప్రతి చట్టానికి తమ మద్దతు ఇస్తూనే ఉంటాయి.

తీరా రాష్ట్రంలో చూస్తే మాత్రం ఆ రెండు పార్టీలను గద్దె దించటమే మా లక్ష్యం అంటూ బీజేపీ నేతలు మాట్లాడుతారు, ఢిల్లీ లో మాత్రం తమకి అవసరమైనప్పుడు ఆయా పార్టీల మద్దతు తీసుకుంటారు. ఇక్కడే బీజేపీ తమ రాజకీయ నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఎవరితోనే పేచీలు లేకుండా ముందుకి పోతూనే వాళ్ళకి చెక్ పెట్టటానికి మరో పక్క రంగం సిద్ధం చేస్తుంది. ఆంధ్రాలో అటు వైసీపీనీ, ఇటు టీడీపీనీ సమాన దూరంలో ఉంచుతుంది. గెలిచాడని జగన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఓడిపోయారని టీడీపీనీ తక్కువగా చూడటం లేదు.

తెలంగాణలో కూడా తెరాస నీ దగ్గరకి తీసుకోలేదు, అలాగని దూరంగా కూడా పెట్టలేదు. అమిత్ షా ఎప్పుడు కావాలని ఫోన్ చేస్తే అప్పుడు జీ హుజూర్ అనటానికి ఆయా పార్టీలు సిద్దమగా ఉన్నాయి. ఆలా అనేలా వాటిని తమ మీద ఆధారపడేలా చేసుకున్నారు బీజేపీ పెద్దలు. బీజేపీ గురించి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడటానికి లేదు. కానీ బీజేపీ మాత్రం రెండు ప్రభుత్వాలను విమర్శిస్తోంది. దీనిని బట్టి చూస్తే మోదీ -షా ద్వయం సత్తా ఏమిటో తెలుస్తుంది.