మెట్రో అధికారులపై మండిపడుతున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – మీ పద్ధతేమి బాగోలేదు…

Friday, February 14th, 2020, 07:28:31 PM IST

బీజేపీ పార్టీ కీలక నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని మెట్రో రైల్ ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రారంభమైన మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తమని పిలవని కారణంగా మెట్రో అధికారులపై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రేపు దిల్ కుషా గెస్ట్ హౌస్ లో మెట్రో రైల్ ఉన్నతాధికారులతో కిషన్ రెడ్డి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇకపోతే ప్రోటోకాల్ ప్రకారం వారికి ఆహ్వానం అందలేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ కూడా మరొకవైపు పార్లమెంటు నడుస్తుంటే మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమాన్ని ఎలా పెట్టుకుంటారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా ఇటీవల జేబీఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు మెట్రో రైలును రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ మార్గం అంతా కూడా 11 కిలోమీటర్ల మేరకు ఉండగా, అందులో 9 స్టేషన్లు ఉన్నాయి. తరువాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్‌రావు ప్రయాణించనున్నారు. మెట్రో నిర్మాణంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకే బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కొత్త మెట్రో కారిడార్ ఏర్పడ్డ తరువాత హైదరాబాద్ మెట్రో రైలు దేశంలోనే రెండవ అతిపెద్ద మెట్రోగా ఆవిర్భావం చెందడం జరిగింది.