ఆర్టీసీ కార్మికులకు అండగా రెడీ అవుతున్న బీజేపీ పోరుబాట..!

Wednesday, October 9th, 2019, 02:30:50 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించి ప్రభుత్వం పెట్టిన డెడ్‌లైన్ లోపు ఉద్యోగులు విధులలో చేరాలని ప్రభుత్వం కోరినా తమ డిమాండ్లు నెరవేరేదాకా సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ ఉద్యోగులు, జేఏసీ తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. యూనియన్ బ్లాక్ మెయిళ్లకు భయపడబోమని, ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఆర్టీసీ మనుగడ సాధించాలంటే కొన్ని చర్యలు తప్పవని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని, వీలైనంత త్వరగా కొత్త నియామకాలు జరుపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల అటు ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు, ఆన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్నాయి. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైతే న్యాయస్థానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్ధతు తెలుపుతున్నామని, ఆర్టీసీ నష్టాలకు సీఎం కేసీఆర్ కారకులని అన్నారు. ఆర్టీసీనీ ప్రైవేట్ వారి చేతుల్లో పెట్టేందుకే కార్మికులపై వేటు వేశారని, కార్మికులు ఈ కక్ష్య సధింపు చర్యలకు అధైర్యపడొద్దని త్వరలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించారు.