మా సభ్యత్వాలకు తెరాస వణికిపోతోంది – బీజేపీ నేత లక్ష్మణ్

Saturday, August 24th, 2019, 12:18:26 AM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.లక్ష్మణ్, తెలంగాణ అధికార పార్టీ అయిన తెరాస పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా శుక్రవారం నాడు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ తెరాస పార్టీ పై మరియు తెరాస నేతలపై తనదైన రీతిలో విరుచుకపడ్డారు… ఈసందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్… టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందని విమర్శలు చేశారు. అంతేకాకుండా జై తెలంగాణ అన్నవారిని అణచివేసి, తెలంగాణ రాడానికి అడ్డుకున్నటువంటి కొందరికి తన మంత్రి వర్గంలో స్థానాన్ని కల్పించిన కెసిఆర్, బంగారు తెలంగాణాని ఎలా నిర్మిస్తారంటూ కెసిఆర్ పై పలు విమర్శలు చేశారు. అంతేకాకుండా బీజేపీ సభ్యత్వ నమోదుపై ఇటీవల తెరాస పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధ్యక్షుడు కేటీఆర్ చేసిన వాఖ్యలపై స్పందించిన లక్ష్మణ్, ‘దొంగే దొంగా.. దొంగా..’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కి రోజురోజుకి ఆదరణ పెరుగుతుందని, దానికి తోడు బీజేపీలో చేరుతున్నటువంటి ముఖ్య నాయకులందరినీ చూసి తెరాస పార్టీ తట్టుకోలేకపోతుందని లక్ష్మణ్ అన్నారు. అంతేకాకుండా “బీజేపీ సభ్యత్వం ఇప్పటికే 18 లక్షలు ఉండగా, కొత్తగా 12 లక్షలు కలుపుకొని 30 లక్షలకు చేరుకుంది. ఇంకా 6 లక్షల సభ్యత్వ నమోదు కావాల్సి ఉంది” అని లక్ష్మణ్‌ తెలిపారు. కాగా తెరాస పార్టీ పై విసుగు చెందిన వారందరు కూడా బీజేపీ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటి వరకు కూడా తెలంగాణాలో బీజేపీకి వచ్చినటువంటి సభ్యత్వాలకు తెరాస అధిష్టానం అంత కూడా గజ గజ వణికిపోతుందని బీజేపీ నేత లక్ష్మణ్ వెల్లడించారు.