మా పార్టీని దెబ్బ తీసింది చంద్రబాబే… కన్నా లక్ష్మీనారాయణ

Tuesday, August 13th, 2019, 03:00:16 AM IST

సోమవారం నాడు రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి పార్టీ ముఖ్య నేత కన్నా లక్ష్మి నారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష టీడీపీ పార్టీ పై, టీడీపీ నేతలపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ ఎదుగుతున్న సమయంలో అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీతో రెండు సార్లు పొత్తు పెట్టుకున్నామని, అయినప్పటికీ కూడా చంద్రబాబు చాలా మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ప్రభుత్వం ఒక ఎటిఎం లాగ వాడుకుందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చంద్రబాబు చాలా కుట్రలు చేశారని చెబుతున్నారు.

అంతేకాకుండా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ పైన కూడా కన్నా లక్ష్మి నారాయణ నిప్పులు చెరిగారు. ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నాక జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలకు అసలు పోలికనే లేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి అల్లకల్లోలంగా సంగతి మనకు తెలిసిందే. అయితే వరద ముంపు ప్రాంతాల్లో జగన్ ఒక్కసారి కూడా పర్యటించలేదని, అసలు వారికోసం ఆలోచించడమే మానేశారని కన్నా తెలిపారు. అదే కాకుండా పంట ముంపునకు గురైన రైతులందరిని కూడా ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేస్తున్నారు. అయితే తాడేపల్లి గూడెంలో ఇటీవల గోవులు సామూహికంగా మరణించడం వెనకాల చాలా పెద్ద కుట్ర ఉందని, అవసరమైతే అందుకోసం ఉద్యమం చేపడతామని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు.