టీడీపీకి దిక్కు ఇక జూనియర్ ఎన్‌టీఆర్ ఒక్కరే – శ్వేతా రెడ్డి

Wednesday, September 18th, 2019, 06:29:01 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే మరో ఐదేళ్ళు గడిచినా పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపించడంలేదు.

అయితే పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్‌టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ తిరిగి పుంజుకుంటుందని మొదట్లో రకరకాల వాదనలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై టీడీపీ నాయకులు కానీ ఎన్‌టీఆర్ కానీ ఏ విధంగా స్పందించలేదు. అయితే ఈ వార్తలకు కాస్త పుల్‌స్టాఫ్ పెట్టేలా కొదీ రోజుల క్రితం బాలక్రిష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్, నారా లోకేశ్ పార్టీలోకి ఎవరొచ్చి సేవ చేసుకున్నా మేము ఆహ్వానిస్తామని, ప్రత్యేకంగా ఎవరిని పిలిచి పార్టీలో చేర్చుకోమని అనడంతో జూనియర్ చేరిక వార్తలకు పూర్తిగా తెర పడిపోయింది. అయితే తాజాగా యాంకర్, బీజేపీ నాయకురాలు శ్వేతా రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీనీ ముందుకు నడిపించే సత్తా జూనియర్ ఎన్‌టీఆర్ ఒక్కరికే ఉందని, ఆయనపైనే టీడీపీ ఫ్యూచర్ ఆధారపడి ఉందని అన్నారు. చాలా మంది టీడీపీలోకి జూనియర్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని, జూనియర్ టీడీపీ పార్టీలో చేరితే ఆ పార్టీ తిరిగి పుంజుకుంటుందని అన్నారు.