ఎంఐఎం పై విరుచుకుపడ్డ బీజేపీ నేత – ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు

Thursday, June 13th, 2019, 12:04:03 AM IST

హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఐఎం అతి మీద తీవ్రమైన విమర్శలు చేశారు… తెలంగాణలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెరాస పార్టీకి మిత్రపక్షంగా పోటీ చేసినటువంటి ఎంఐఎం పార్టీకి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఏంటిఅని మండిపడ్డారు లక్ష్మణ్. ఒకవేళ ఎంఐఎం పార్టీకి గనక ప్రతిపక్ష హోదా వస్తే మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎప్పటికైనా రాష్ట్రంలో తెరాస కి ప్రత్యామ్నాయం బీజేపీ అని లక్ష్మణ్ తేల్చి చెప్పారు. అంతేకాకుండా దక్షిణాదిలో కర్ణాటక తరువాత బీజేపీ కి అనువైన ప్రాంతం తెలంగాణ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు… ఎప్పటికైనా తెలంగాణాకి మోడీ ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తుందని అన్నారు.

అంతేకాకుండా ఇటీవల టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం చేయడం కరెక్టు కాదని, ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని టీఆర్ఎస్ తప్పు చేయడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణాలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని, అందుకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరు కూడా సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్ తేల్చి చెప్పారు. ఇకపోతే తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలు, కుటుంబ పాలన, ప్రజావ్యతిరేక పాలనపై పోరాటాలు, ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని, అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. ఇప్పటివరకు కూడా తెరాస ప్రభుత్వం ప్రజలకు అండగా ఏమి చేయలేకపోయిందని, ఇంకెన్ని రోజులు ఇలా కుట్ర పూరిత రాజకీయాలు చేస్తుందని లక్ష్మణ్ విమర్శించారు.