టీడీపీకి మరో దెబ్బ..? ఈ సారి వంతు బీజేపీది..పాపం బాబు గారు

Friday, June 14th, 2019, 03:38:16 PM IST

తెలుగుదేశం పార్టీకి 2019 అసలు బొత్తిగా కలిసివచ్చినట్లు లేదు. ఈ ఏడాదే తెలంగాణలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ తన కార్యకలాపాలు ఆపేసి, లోక్ సభ ఎన్నికలకు కూడా పోటీ చేయకుండా తమకు తామే అస్త్ర సన్యాసం తీసుకున్నారు. ఇక ఆంధ్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఒక పీడకలగా మారిపోయింది తెలుగు తమ్ముళ్ళకి, గెలిచిన 23 మందిలో ఎప్పుడు,ఎవరు ఎంత మంది గోడ దూకుతారో తెలియని అయోమయ స్థితిలో ఉంది టీడీపీ పార్టీ. నిన్నటికి నిన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ నేను గేట్ తెరిస్తే అక్కడ టీడీపీ ఖాళీ అవుతుందని హెచ్చరికలు పంపించాడు. అది మరవకముందే బీజేపీ నుండి అలాంటి హెచ్చరిక అనధికారికంగా వచ్చినట్లు తెలుస్తుంది.

అదేమిటంటే టీడీపీ తరుపున బొటాబొటి మెజారిటీతో గెలిచిన ముగ్గురు ఎంపీలు కూడా బీజేపీ వైపు చేరటానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం, బీజేపీలోని వేగుల ద్వారా చంద్రబాబుకి చేరినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేశినేని నాని వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాడు. దానిని ఆపటానికి చంద్రబాబు శతవిధాలుగా కృషి చేస్తున్న ఫలితం లేదు. ఇక మిగిలిన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కూడా ఎక్కువ రోజులు టీడీపీ లో ఉండే పరిస్థితి కనిపించటం లేదని చెపుతున్నారు. ఒక వేళ కష్టం మీద రామ్మోహన్ నాయుడు ఉంటే ఉండవచ్చు కానీ, వ్యాపారవేత్త అయినా గల్లా జయదేవ్ మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. నిన్న ఏమో జగన్ హెచ్చరిక..నేడు ఏమో బీజేపీ హెచ్చరిక..పాపం బాబుగారికి ఈ వయస్సులో ఎంత కష్టం వచ్చిందో..