తెలంగాణలో కమలానికి బేస్ లేదని తేలిపోయింది !

Wednesday, June 5th, 2019, 12:04:52 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య రీతిలో 4 స్థానాల్ని గెలుచుకున్న భాజాపా తెలంగాణలో పార్టీకి పునాదులు పద్దాయని, రాబోయే రోజుల్లో హవా తమదేనని బాకాలు ఊదుకుంది. కొంతమంది నేతలైతే స్థానిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి తమ బలాన్ని నిరూపించుకుంటామని గొప్పలు చెప్పారు. కానీ నిన్న వెలువడిన ఫలితాలతో వారివి పగటి కలలేనని, రాష్ట్రంలో వారికి బేస్ సరిగా లేదని తేలిపోయింది.

నిన్న వెలువడిన ఫలితాల్లో తెరాస 6 జిల్లాలను క్లీన్ స్వీప్ చేసి మిగతా జిల్లాల్లోనూ అగ్రగామిగా నిలబడింది. మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలకుగాను తెరాస 448 గెలవగా భాజాపా కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కొద్దిగా పుంజుకుని 76 చోట్ల గెలిచింది. అలాగే ఎంపీటీసీ స్థానాల్లో కూడా కమలం రెక్కలు రాలిపోయే రిజల్ట్ వచ్చింది. 5816 స్థానాలకుగాను తెరాస 3559 స్థానాల్లో, కాంగ్రెస్ 1393 స్థానాల్లో గెలవగా భాజాపా కేవలం 210 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలతో భాజాపా నేతలు ఊహించుకున్నట్టు పల్లెల్లో వారికి బేస్ ఉందనేది కేవలం ఊహా మాత్రమేనని రూడీ అయింది.