ఈసారి 250 సీట్ల టార్గెట్ ఫిక్స్ చేసిన మోడీ

Wednesday, June 12th, 2019, 09:58:25 AM IST

దేశం మొత్తంలో ఎన్నికల వేడి తగ్గినా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం తగ్గలేదు. భాజాపా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల నడుమ చోటు చేసుకుంటున్న పరిస్థితులు రోజు రోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఎన్నికల తర్వాత కూడా అల్లర్లు రేగడంతో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందని గవర్నర్ హెచ్చరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రం నుండి మోడీ,అమిత్ షా బెంగాల్ లో భాజాపా ఆపరేట్ చేస్తుండగా వారిని ఎదుర్కోవడంలో సీఎం మమతా బెనర్జీ ఎక్కడా తగ్గడంలేదు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లు నెగ్గడంతో భాజాపా కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. ఇదే దూకుడుతో ముందుకెళ్లి 2021లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లలో 250 ఖచ్చితంగా గెలవాలని మోడీ, అమిత్ షాలు పథకం రచిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాలను ప్రధాన పార్టీల బాలా బాలల ఆధారంగా నాలుగు భాగాలుగా విభజించి ఇప్పటి నుండే అభ్యర్థుల వేట స్టార్ట్ చేశారు. అంతేకాదు తృణమూల్ నుండి కీలక నేతల్ని పార్టీలో చేర్చుకోవడం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో మోడీ 40 మంది తృణమూల్ నేతలు తమతో టచ్లో ఉన్నారని చెప్పిన ప్రకారమే కొందరు నేతలు భాజపాతో మంతనాల సాగిస్తున్నారట. ఇంకొన్ని నెలల్లో ఫిరాయింపుల పర్వం మొదలయ్యే సూచనలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.