ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ నిన్న షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నిలకు బీజేపీ సిద్ధంగా ఉందని, ఈసీ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అయితే గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ దాదాపు 25 శాతం దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుందని, పాత నోటిఫికేషన్ రద్దు చేయాలని గతంలో సైతం దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని దీనిని ఎన్నికల కమీషనర్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు.
అయితే ఇదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు చెప్పామని సోము వీర్రాజు అన్నారు. కానీ నేడు ఎన్నికల కమీషనర్ పంచాయతీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి పాత నోటిఫికేషన్ రద్దు చేయలేదని అన్నారు. అయితే పాత నోటిఫికేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఎన్నికల కమీషన్ను డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు అన్నారు. ఇదిలా ఉంటే అటు సీపీఐ పార్టీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించింది.