గులాబీదళానికి కమలదళం చెక్ పెడుతుందా..?

Saturday, September 6th, 2014, 11:16:19 AM IST


మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాల కోసం బీజేపి శ్రేణులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.. అధికార పార్టీకి తీవ్ర పోటీ ఇచ్చేందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వం మొత్తం ఉప ఎన్నికల్లోనే నిమగ్నమైంది. జగ్గారెడ్డి గెలుపు పూర్తిగా రాష్ట్ర నేతలు భుజాన వేసుకున్న నేపథ్యంలో అభ్యర్థి గెలుపుతో పాటు అధికార పార్టీ మెజారిటి తగ్గించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు..

మెదక్ లోక్ సభ ఉప ఎన్నిక బీజేపి కూటమికి సవాలుగా మారాయి.. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ యంత్రంగం మొత్తం మెదక్ లో పాగ వేసింది.. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు, మాజి ఎమ్మెల్యేలు,సీనియర్ నేతలు కలిసి సుమారు యాబై మందికి పైగా రాష్ట్ర నేతలు మెదక్ నియోజక వర్గంలోనే మకాం వేశారు. పెద్ద పెద్ద బహిరంగ సభలకు అవకాశం లేకుండా ఇంటింటి ప్రచారంపై ఆధారపడ్డారు. దీంతో ఫలితాలపై పార్టీ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జగ్గారెడ్డి స్వంత నియోజక వర్గమైన సంగారెడ్డితోపాటు పటాన్ చెరువు నియోజక వర్గాల్లో పూర్తి స్థాయి మెజారిటి సాధించడంపై దృష్టి సారించారు.

హిందుత్వ ఎజెండాతో ఓట్లను సాధించుకోవడంలో భాగంగా ఆర్ఎస్ఎస్ నాయకులను సైతం రంగంలోకి దింపారు.. దీంతోపాటు గజ్వేల్ లో టీడీపీకి బలం ఉన్న నేపథ్యంలో అక్కడ తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.. ఇక టీఆర్ఎస్ అభ్యర్థికి ఎక్కువ మెజారీటిని ఇచ్చే సిద్దిపేటలో సాధ్యమైనంతగా తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు.. ఇందుకోసం టీఆర్ఎస్ లో ఉన్న వర్గవిభేదాలను ఉపయోగించుకుంటున్నారు.. ఎన్నికల్లో హరీష్ రావు వర్గానికి చెందిన వ్యక్తి కి సీటు దక్కకపోవడంతో కొంత మెజారిటి తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచన వేస్తున్నారు.. ఇందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఇక టీడీపీతో జతకట్టడడంతో సమైక్య వాదాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండడం పార్టీకి కొంత ఇబ్బందిగా మారింది. అయితే బీజేపి శ్రేణులు ఆ ఆరోపణలకు దీటుగానే సమధానం చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమైఖ్యవాదానికి అర్థం లేదని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వ వైఫల్యలతోపాటు, మోడి అభివృద్ది మంత్రమే ఎన్నికల్లో బీజేపికి పట్టం కడుతుందనే దీమాను వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ ఉప ఎన్నిక బీజేపికి కలిసి వచ్చే అంశం కావడంతో పార్టీ రాష్ట్ర నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి..