ఏపీ రాజధానిపై బొత్స యూ టర్న్.. ఇంకా స్పష్టత లేదు..!

Saturday, December 14th, 2019, 11:50:13 PM IST

ఏపీ రాజధానిపై గత కొద్ది రోజులుగా ముడిపడి ఉన్న సందిగ్ధతకు నిన్న తెర పడిందనుకున్నలోపే రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ మళ్ళీ అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. నిన్న మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ రాజధాని మార్పు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సమాధానమిస్తూ ఏపీ రాజధాని అమరావతిని మార్చడం లేదంటూ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. అయితే రాజధానిపై మరో సారి యూటర్న్ తీసుకున్న బొత్స రాజధాని పై స్పష్టత కోసం కమిటీ వేశామని అన్నారు.

అయితే ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, అందుకే నిన్నటి పరిస్థితిని బట్టి అమరావతే రాజధాని అని చెప్పానని బొత్స వివరణ ఇచ్చారు. అంతేకాదు అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని, గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరుతో భారీ దొపీడీలు జరిగాయని ఆరోపించారు.