ఐక్యూ టెస్ట్ లో ఐన్ స్టీన్, హాకింగ్ లనే దాటేసైన బాలుడు !

Sunday, January 28th, 2018, 02:00:30 AM IST

బ్రిటన్ దేశం లో ఉంటున్న భారత సంతతి కుర్రాడు మెహుల్ గార్గ్ మెన్సా ఐక్యూ టెస్ట్ లో అత్యధిక స్కోర్ సాధించాడు. అంతే కాదు అతను స్కోర్ దిగ్గజ శాస్త్రవేత్తలైన ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లనే మించి సాధించాడు. మేధావితనానికి కొలమానం గా భావించే మెన్సా ఐక్యూ టెస్ట్ లో అతడు ఏకంగా 162 పాయింట్లు సాధించడం విశేషం. అంతే కాక గడిచిన గత పదేళ్లలో ఈ టెస్ట్ లో అత్యధిక స్కోర్ సాధించిన పిన్న వయస్కుడిగా కూడా రికార్డు సాధించాడు. అయితే ఇదివరకే మెహుల్ అన్నయ్య ధృవ్ గార్గ్ (13) కూడా గత ఏడాది ఈ టెస్ట్ లో 162 పాయింట్లే సాదించాడు. అన్నయ్యను స్ఫూర్తిగా తీసుకున్న మెహుల్ అన్నకు ఏ మాత్రం తీసిపోనని నిరూపించాడు. నిజానికి ఈ ఐక్యూ పరీక్షలో 140 స్కోర్ సాధించిన వారిని మేధావి గా పిలుస్తారు. అయితే ఐన్ స్టీన్, హాకింగ్ ల స్కోర్ 160. వారినే దాటిన ఈ ఇద్దరు సోదరులను అపర మేధావులనే పిలవాలేమో అని విశ్లేషకులు అంటున్నారు. మెహుల్ సౌత్ ఇంగ్లాండ్, రీడింగ్ టౌన్ లోని రీడింగ్ బాయ్స్ గ్రామర్ స్కూల్ లో చదువుతున్నాడు. మాథెమాటిక్స్ తన ఫేవరెట్ అని చెప్పే మెహుల్ ఆటల్లో క్రికెట్, ఐస్ స్కేటింగ్ అంటే అమిత ప్రేమ అంటున్నాడు. ఐక్యూ టెస్ట్ ఫలితాలు రాగానే అత్యంత భావోద్వేగానికి లోనయ్యానని, భవిష్యత్తులో గూగుల్ కంటే పెద్ద కంపెనీ పెట్టాలనేది తన ఆలోచన అని చెప్పాడు. అంతే కాదు ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి విరాళాల ద్వారా 1700 పౌండ్లు సంపాదించారు, ఇది మన భారత కరెన్సీ ప్రకారం రూ.1,17 000. వీటితో తన స్నేహితులతో కలిసి ఒంటరితనాన్ని, అలాంటి భావనని దూరంచేసి యాప్ ఒకటి రూపొందించడం చెప్పుకోదగ్గ విశేషం. అంతేకాదండోయి మెహుల్ రూబిక్ క్యూబ్ ని వంద సెకండ్లలో సెట్ చేయడం లో కూడా దిట్ట….