అమ్మాయిల హాస్టల్ తాళం పగలగొట్టి లోపలకి వెళ్లిన యువకులు ఏం చేసారో తెలుసా…?

Monday, January 23rd, 2017, 11:14:03 AM IST

boys
కర్నూల్ జిల్లా నంద్యాలలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల హాస్టల్ లో కొంతమంది తాగుబోతులు వీరవిహారం చేశారు. గేటుకు వేసిన తాళాన్ని బద్దలగొట్టి మరీ లోపలకు చొరబడ్డారు. దాదాపు గంటసేపు హాస్టల్ లోని అమ్మాయిలతో చెప్పుకోలేని విధంగా ప్రవర్తించారు. ఈ సంఘటన మరొకసారి అమ్మయిల భద్రతపై అనుమానాలకు తావిస్తుంది.

నంద్యాలలోని ఈఎస్పీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 20 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఇందులోనే కళాశాలతో పాటు బాలబాలికకు వేర్వేరుగా హాస్టల్స్ ఉన్నాయి. అమ్మాయిల హాస్టల్ లో 60 మందికి పైగా ఉన్నారు. అందులో చాలామంది విద్యార్థులు సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లగా ప్రస్తుతం ఆ హాస్టల్ లో 20 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి 1.30 సమయంలో నలుగురు దుండగులు హాస్టల్ భవనం వద్దకు చేరుకొని మెయిన్ గేటు కు ఉన్న తాళాన్ని బద్దలుకొట్టి మొదట ముగ్గురు లోపలకి ప్రవేశించారు. తరువాత మరొక దుండగుడు లోపలకు ప్రవేశించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. హాస్టల్ కింది భాగంలో నలుగురు, మొదటి అంతస్తులో 16 మంది అమ్మాయిలో గాఢ నిద్రలో ఉన్నారు. ఒక దుండగుడు కింది రూమ్ తలుపు కొట్టడంతో తలుపు తీసిన విద్యార్థులు దుండగుడిని చూసి భయంతో పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పై అంతస్తులో మరొక ముగ్గురు దుండగులు అమ్మాయిలను వేధిస్తూ కనపడ్డారు. సినిమా హీరోయిన్ల పేర్లతో బాలికలను పిలుస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. మాటలతోనే కాకుండా చేష్టలతో కూడా అందరూ సిగ్గు పడే విధంగా దుండగులు అమ్మాయిలతో ప్రవర్తించారు. బాలికల అరుపులు విని పక్కనే బాయ్స్ హాస్టల్ లో ఉన్న అబ్బాయిలు పరుగెత్తుకు రావడంతో దుండగులు పరారయ్యారు. విద్యార్థులు ఫోన్ చేయగా పోలీసులు అక్కడకి చేరుకుని విచారించారు.

కళాశాలలో ఇద్దరు వాచ్ మెన్లు పగలు, ఇద్దరు రాత్రి విధులు నిర్వహించాలి. తాగుబోతులు ప్రవేశించిన సమయంలో అక్కడ వాచ్ మెన్లు పరిపాలన భవనంలో నిద్రపోతున్నట్టు సమాచారం. హాస్టల్ లో జరిగిన సంఘటన గురించి విద్యార్థినులు పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించినా, సీసీటీవీలో రికార్డు అయినా పోలీసులు మాత్రం హాస్టల్ లో దొంగతనం జరిగినట్టుగా ప్రిన్సిపాల్ తో ఫిర్యాదు రాయించుకుని చేతులు దులుపుకున్నారు. ఏడు సెల్ ఫోన్లు, ఒక జత కమ్మలు, 1100 రూపాయల నగదు, ఎటిఎం కార్డులు చోరీకి గురయ్యాయని ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేసారని, కేసు నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.