మంగళగిరి లో దారుణం : తల్లి శవాన్ని కూడా ఇంట్లోకి రానివ్వని కొడుకు…

Tuesday, May 26th, 2020, 01:45:02 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల మధ్యన బంధాలు, అనుబంధాలు, మానవతా విలువలు అన్ని కూడా మంటగలిసిపోతున్నాయి. డబ్బు మాయలోపడి కొందరు, చేదు వ్యసనాలకు బానిసలై మరికొందరు, తప్పుడు ఆలోచనలతో కొందరు, ఇలా అందరు కూడా ఎవరికీ వారు తమ పక్కవారిని, తోబుట్టువులను, కనిపెంచిన తల్లిదండ్రులను అందరిని కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చివరికి వారు ఏదైనా అనివార్య కారణంతో మరణించినప్పటికీ కూడా కనీసం వారి శవాలను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు. కాగా నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి, అనారోగ్య సమస్యతో బాధపడుతూ చనిపోతే, కనీసం ఆవిడ శవాన్ని కూడా ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడో కర్కశ కుమారుడు.

ఈ దారుణమైన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. కాగా గత కొంత కాలంగా స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. దానికి తోడు ఆస్తి కోసమని తల్లిదండ్రులతో రోజు గొడవపడేవాడు. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతున్న కారణంగా, అతడిపై తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టి జైల్లో వేపించినప్పటికీ కూడా మళ్ళీ అదే తరహాలో గొడవలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది తన తండ్రి మరణించగా, తండ్రికి అంత్యక్రియలు చేయాలంటే ఆస్తి రాసివ్వాలని షరతు పెట్టాడు. దీంతో తల్లి చేసేదేమిలేక సగం వాటా ఇచ్చేందుకు అంగీకరించింది. కాగా మిగిలిన ఆస్తి కోసం తల్లిని నిత్యం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసేవాడు.

అతడి వేధింపులు తట్టుకోలేక ఆ వృద్ధురాలు తన కూతురు వద్దకు వెళ్ళివుంటుంది. కాగా ఆ వృద్ధురాలు కూడా గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై, బాపట్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ తరుణంలో తల్లి మృతదేహంతో మంగళగిరిలోని ఇంటికి చేరింది కూతురు. అయితే తన తల్లిశవాన్ని కూడా ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు ఆ మూర్ఖుడు. బంధువులు, స్థానికులు ఎంతలా బ్రతిమిలాడినప్పటికీ కూడా కనీసం కనికరించలేదు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతడ్ని అదుపులోకి తీసుకొని అంత్యక్రియలు జరిపించారు.