మాయవతికి షాకిచ్చిన సొంత ఎమ్మెల్యేలు

Tuesday, September 17th, 2019, 01:09:33 PM IST

బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. రాజస్థాన్‌లో ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజేంద్ర గడ్‌, జోగేంద్ర సింగ్‌ అవానా, వాజిబ్‌ అలీ, లఖన్‌ సింగ్‌ మీనా, సందీప్‌ యాదవ్‌, దీప్‌చంద్‌ ఖేరియాలు కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి సిద్దమయ్యారు. వీరంతా సీఎం అశోక్‌ గహ్లోత్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ పని చేస్తున్నాం. అశోక్‌ గహ్లోత్ కంటే రాజస్తాన్‌న గొప్పగా పాలించే సీఎం లేరు. బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు తెలిపే బదులు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాం అని అన్నారు. ఈ పరిణామంతో గత ఎన్నికల్లో 100 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ 106 సీట్లతో మరింత బలపడింది.