లోకేష్ సవాల్ కి స్పందించలేదంటే బాబాయ్ ది గుండెపోటు కాదన్నమాటేగా – బుద్దా వెంకన్న

Thursday, April 8th, 2021, 03:56:00 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక పులివెందుల రాజన్నకోట రహస్యమేంటో బయట పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14 వ తేదీన తిరుపతి వెంకటేశ్వర స్వామి పై ప్రమాణానికి వస్తున్నారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక నారా లోకేష్ సవాల్ కి స్పందించలేదు అంటే బాబాయ్ ది గుండెపోటు కాదన్నమాటేగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాక మరొక ట్వీట్ లో వర్ల రామయ్య కి బెదిరింపు కాల్స్ రావడం పట్ల స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత నాయకుడు, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య కి వైసీపీ రౌడీలు ఫోన్ చేసి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే వర్ల రామయ్య కి బెదిరింపు కాల్స్ పై విచారణ జరిపించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే వర్ల రామయ్య కి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అంటూ చెప్పుకొచ్చారు.