బంపర్ ఆఫర్ – ఒక్క సంవత్సరం ఫోన్ వాడకపోతే 72 లక్షలు మీవే…

Monday, December 17th, 2018, 06:31:35 PM IST

మీరు ఒక సంవత్సరం పాటు ఫోన్ వాడకపోతే మీకు 72 లక్షల రూపాయలను ఇస్తానని ఒక కంపెనీ వినూత్నమైన బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. కేవలం ఒకే ఒక్క ఏడాది పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకుండా ఉండగలరా…? అయితే ఈ సువర్ణ అవకాశం మీకోసమే అంటూ ఒక కంపెనీ తన ప్రకటనని విడుదల చేసింది. కోకకోలా సంస్థకు చెందిన విటమిన్‌ వాటర్ అనే కంపెనీ ‘నో ఫోన్‌ ఫర్‌ ఎ ఇయర్‌’ పేరిట ఓ వినూత్నమైన బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించి, అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఏడాది పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకుండా ఉంటే రూ.72 లక్షలు చెల్లిస్తుందట. ఈ విషయాన్ని విటమిన్‌ వాటర్‌ కంపెనీ ట్విటర్‌ వేదికగా తెలిపింది. అయితే కంపెనీకి తెలీకుండా గుట్టుగా ఫోన్‌ వాడేసి ఆ తర్వాత అసలు నేను ఫోనే వాడలేదు అని చెబితే మాత్రం ఒప్పుకునేది లేదంటూ తెగేసి చెప్పేసింది సదరు కంపెనీ. ఈ పోటీలో పాల్గొనే వారికి సరిగ్గా ఏడాది తరువాత ఆ కంపెనీ లై డిటెక్టర్‌ టెస్ట్‌ నిర్వహించనుంది. దీన్ని బట్టి సదరు మనిషి నిబంధనలకి కట్టుబడి ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది కూడా. అంతే కాకుండా ఈ పోటీల్లో పాల్గొనేవారికి ఆ కంపెనీ 1996 కాలం నాటి సెల్యులార్‌ టెలిఫోన్‌ను ఇస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌కి బదులు ఏడాది పాటు ఇదే టెలిఫోన్‌ను వాడుకోవచ్చు. దీనికి అయ్యే డబ్బు కూడా కంపెనీనే చెల్లిస్తుంది.

ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విటర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీల్లో పాల్గొనేవారు స్మార్ట్‌ఫోన్‌ లేకుండా సమయాన్ని ఎలా గడుపుతారు అనే విషయాన్నీ కంపెనీకి తెలియపరచాలి. వారికి పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్‌ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ వాడుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఏడాది పాటు ఫోన్‌ వాడకుండా ఉండలేనివారికీ కంపెనీ ఓ అవకాశం కల్పించింది. ఆరు నెలల పాటు ఫోన్‌ వాడకపోయినా రూ.7లక్షలను బహుమతిగా ఇవ్వనున్నారంట. మరి ఇంకెందుకు ఆలస్యం…?