వన్‌డేలలో వంద వికెట్లు పడగొట్టిన బుమ్రా..!

Saturday, July 6th, 2019, 03:50:16 PM IST

ప్రస్తుతం ఇంగ్లాడ్‌లో జరుగుతున్న ఐసీసీ 2019 ప్రపంచకప్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా నేడు భారత్ శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. బుమ్రా వేసిన 4వ ఓవర్‌లో నాలుగో బంతికి శ్రీలంక ఆటగాడు కరుణరత్నెను ఓట్ చేయడంతో వన్డేలలో 100 వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ళ జాబితాలోకి చేరిపోయాడు. అంతేకాదు అతి తక్కువ వన్డే మ్యాచ్‌లలో వంద వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ బౌలర్‌గా బుమ్రా రికార్డ్‌కెక్కాడు. అయితే మొదటి స్థానంలో మహమ్మద్ షమి 56 వన్డేలలో వంద వికెట్లు పడగొట్టగా, బుమ్రా 57 వన్డేలలో వంద వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు.

అయితే అంతర్జాతీయంగా చూసుకుంటే మాత్రం ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 44 మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో నిలబడగా, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్‌ స్టార్క్‌ 52 మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో పాక్ ఆటగాడు సక్లేన్‌ ముస్తాక్‌ 53 మ్యాచ్‌లలో 100 వికెట్లు పడగొట్టాడు.