రూపాయి కోసం దారుణం : ప్రయాణికుడిని చితకబాదిన బస్సు కండక్టర్

Tuesday, December 3rd, 2019, 12:41:59 PM IST

ఒక్క రూపాయి కోసం బస్సు కండక్టర్, ఒక ప్రయాణికుడిపై దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి తాలూకా చిక్కపాలనహళ్లి గ్రామంలో జరిగింది. ఒక్క రూపాయి చిల్లర విషయమై బస్సు కండక్టర్ మరియు ప్రయాణికుడి మధ్యన తీవ్రమైన ఘర్షణ జరిగింది. కాగా సోమవారం మధుగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సులో నాగేనహళ్లి గ్రామానికి చెందిన కంబయ్య అనే వ్యక్తి తన ప్రయాణ నిమిత్తం తాను చేరవలసిన ప్రదేశానికి ఓక టికెట్ తీసుకున్నారు. ఈమేరకు బస్సు కండక్టర్ ప్రయాణికుడికి ఒక రూపాయి చిల్లర ఇవ్వాల్సి ఉంది. కాగా ప్రయాణికుడు చేరవలసిన ప్రదేశం సమీపిస్తుండటంతో తనకు రావాల్సిన రూపాయి చిల్లర ఇవ్వాలంటూ ప్రయాణికుడు కంబయ్య, కండక్టర్‌ అజ్జప్పను అడిగాడు. అయితే తన వద్ద చిల్లర లేదని, ఇవ్వడం కుదరదని కండక్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

ఇదే విషయం మీద ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. అయితే ప్రయాణికుడిపై ఆగ్రహించిన బస్సు కండక్టర్ అజ్జప్ప, తన వద్ద ఉన్నటువంటి టికెట్ మిషిన్ తో ప్రయాణికుడు కంబయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ గొడవ శృతిమించడంతో ప్రయాణికులు వారిరువురికి విడిపించే ప్రయత్నం చేశారు. కాగా కంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధుగిరి పోలీసులు కంబయ్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి కంబయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా బస్సు కండక్టర్ తీరుపై ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.