బిగ్ బాస్-2 అంచనాలను అందుకుంటుందా?

Sunday, June 10th, 2018, 10:17:34 AM IST

బిగ్ బాస్ సీజన్ 1 ఎంత అద్భుతంగా సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెరకు హోస్ట్ గా వ్యవహరించిన ఈ షోకి రేటింగ్స్ చాలా బాగా వచ్చాయి కూడా. తొలుత 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్న ఈ షో 70 రోజులపాటు ఎంతో ఉత్కంఠత తో సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ షో లో నటుడు శివ బాలాజీ విజేతగా నిలుగవగా, ఆదర్శ్ బాలకృష్ణ రన్నరప్ గా నిలిచాడు. ఇక అప్పటినుండి ఈ షో సెకండ్ సీజన్ ఎప్పటినుండి ప్రారంభం అవుతుందా అని అందరిలోనూ ఒకటే ఉత్సుకత. అయితే ఎట్టకేలకు ఈ షో నేడు రాత్రి నుండి ప్రారంభం కానుంది. అంతే కాదు ఈ సారి షో కి ఎన్టీఆర్ స్థానంలో నాచురల్ స్టార్ నానిని స్టార్ మా ఎంపిక చేసిన విషయం విదితమే. ఇకపోతే ఈ షో ప్రోమోలో నాని ఇంకొంచెం మసాలా వుంది అంటున్నాడు, అదేమిటో తెలియాలంటే షో ప్రారంభమయ్యేవరకు ఆగవలసిందే అంటున్నారు. అంతే కాక కొందరు సామాన్య వ్యక్తులు కూడా ఈ సీజన్లో పాల్గొననున్నారట.

ఇక అసలు విషయం ఏమిటంటే, ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు పేర్లు బయటకి వచ్చాయి. వారు సింగర్ గీత మాధురి, టీవీ9 యాంకర్ దీప్తి, తేజస్విని మదివాడ, బాబు గోగినేని, తనీష్, వరుణ్ సందేశ్, వైవా హర్ష, సామ్రాట్, యాంకర్ శ్యామల, కృతి దామరాజు, సునైనా, నూతన నాయుడు, గణేష్, సంజన, అమిత్ తివారి ఇలా పలువురి పేర్లు బయటికొచ్చాయి. అయితే ఇందులో కొందరు మాత్రమే మనకు సుపరిచితులని, మరికొందరు చాలా మందికి తెలియరని, అందువల్ల ఈ షో మొదటి సీజన్ వలే ఎంతవరకు ప్రజల్లో ఆదరణ చూరగొంటుందో ఇప్పుడే చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాక ఎన్టీఆర్ మంచి మాటకారి అందునా పరిస్థితికి తగ్గట్లుగా వ్యవహరించగల వ్యక్తి అని, మరి నాని అయన స్థాయిని ఎంతవరకు అందుకుని షోని ముందుకు తీసుకెళ్తారో వేచిచూడాలి అంటున్నారు…….