‘నానువ్వే’ కళ్యాణ్ రామ్ ను గట్టెక్కిస్తుందా?

Wednesday, June 13th, 2018, 01:04:02 AM IST

యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కాస్త గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన పటాస్ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత ఆయన చేసిన షేర్, ఇజం, ఎమ్యెల్యే ఇలా మూడు చిత్రాలు బాక్స్ ఆఫిస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అందువల్ల ఇటువంటి సమయంలో ఆయనకు ఒక మంచి హిట్ అవసరం. ఇకపోతే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా వున్న ఆయన నటించిన నూతన చిత్రం నానువ్వే ఎల్లుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి 180 మూవీ ఫేమ్ జయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా మిల్క్ బ్యూటీ తమన్నా ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రం ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడం ఒకవైపు, అలానే ఇప్పటివరకు చాలా ఎక్కువగా మాస్ చిత్రాలే చేసిన కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రెండ్ మార్చి పూర్తి స్థాయి క్లాసి లవ్ స్టోరీ చేయడంతో సినిమాపై అంచనాలు ఒకింత తగ్గాయని అంటున్నారు. అదీ కాకా కళ్యాణ్ రామ్ చిత్రాలకు కొన్ని సెంటర్లలో మంచి వస్తుంటాయని, అయితే ఈ చిత్రానికి మాత్రం ఆశించినంత ఓపెనింగ్స్ వచ్చేలా కనపడడం లేదట. ఇకపోతే క్లాస్ చిత్రం కావడంతో కనీసం ఏ సెంటర్లలో అయినా మంచి ఓపెనింగ్స్ రాబట్టగలదా అంటే అది కూడా అనుమానమే అంటున్నారు. మొదటి నుండి ఈ చిత్ర విషయాలను లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న యూనిట్,

ఒక్కసారిగా చిత్రానికి భారీ హైప్, పబ్లిసిటీ తెచ్చేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను రప్పించినప్పటికీ పెద్దగా ఉపయోగంలేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు సుధీర్ బాబు నటించిన సమ్మోహనం కూడా విడుదలవుతుండటంతో ఆ చిత్రం ఏమాత్రం మంచి టాక్ సంపాదించినా కలెక్షన్లు చాలావరకు అటువైపుకుమళ్లే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం తమకు పూర్తి నమ్మకముందని, సినిమా విడుదల తర్వాత ఇప్పటివరకు వున్న అనుమానాలన్నీ తొలగి మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కళ్యాణ్ రామ్ భవిష్యత్తు ఎలా ఉందొ తెలియాలంటే 15వ తేదీవరకు ఆగక తప్పదు మరి……

  •  
  •  
  •  
  •  

Comments