టెండూల్కర్ రికార్డుల దిశగా కోహ్లీ, కుక్

Tuesday, July 30th, 2013, 05:07:04 PM IST


అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు.. 34 వేలు పరుగులు.. ఒకప్పుడు ఊహకే అందని ఈ రికార్డుల్ని సచిన్ సాధించాడు. వీటిని అధిగమించడం అసాధ్యమన్నది చాలామంది అభిప్రాయం. ఐతే రికార్డులున్నది బద్దలు కావడానికే. ప్రపంచ క్రీడారంగంలో ఏ రికార్డూ శాశ్వతం కాదు. సచిన్ రికార్డుల్ని బ్రేక్ చేయడం చాలా కష్టమే కావచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు.టెండూల్కర్ రికార్డులు కూడా బద్దలయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.ప్రస్తుత క్రికెట్ క్రీడాప్రంపంచలో వాటిని బద్దలు కొట్టే సత్తా ఇద్దరికే ఉందని అంటున్నారు. భారత యువ సంచలనం విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్‌లకు ఆ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.టెస్టు క్రికెట్లో కుక్ పరుగుల ప్రవాహం, సచిన్ రికార్డు దిశగానే సాగుతోంది. ప్రతీ ఏడు ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ చొప్పున బాదేస్తున్నాడు. దాదాపుగా మాస్టర్ కూడా తన కెరీర్‌లో అంతే. గత ఏడేళ్లలోనే కుక్ 167 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఏడాదికి సరాసరి 24. మొత్తం 7607 పరుగులు చేశాడు. ఇక 40 ఏళ్ల సచిన్ తన 24 ఏళ్ల కెరీర్‌లో 327 ఇన్నింగ్స్‌ల్లో 15837 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలున్నాయి. కాగా ఏడాదికి 14 ఇన్నింగ్స్‌లే ఆడాడు. అంటే కుక్ కంటే 10 తక్కువ. కుక్ వయసు ప్రస్తుతం 28 ఏళ్లు. కెరీర్ మధ్య దశలో ఉన్నాడు. జాగ్రత్తగా ఆడితే మరో ఏడెనిమిదేళ్లు కెరీర్ కొనసాగించవచ్చు. మరో 174 ఇన్నింగ్స్‌లు ఆడితే 51 సెంచరీలు చేయొచ్చు. 15 వేల పరుగుల మైలురాయినీ అందుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా పరుగులు చేయగల సత్తా అతనికుంది.టీమిండియా యువ కెరటం విరాట్‌ను సచిన్ వారసుడిగా కొందరు అభివర్ణిస్తున్నారు. జింబాబ్వే పర్యటనలో కెరీర్ 15వ వన్డే సెంచరీ సాధించిన కోహ్లీ.. అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. నిలకడగా రాణిస్తున్న కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతని వయసు ప్రస్తుతం 24 ఏళ్లు. ఐదేళ్ల కెరీర్‌లో 108 ఇన్నింగ్స్‌లు ఆడి 4575 పరుగులు సాధించాడు. సచిన్ సరాసరి తొమ్మిది ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ కొడితే.. కోహ్లీ ఏడు ఇన్నింగ్స్‌లకోసారి శతకం బాదాడు. విరాట్ ఏడాదికి 21 ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. వన్డేల నుంచి రిటైరయిన మాస్టర్ 452 ఇన్నింగ్స్‌ల్లో 18426 పరుగులు సాధించాడు. ఇందులో 49 సెంచరీలున్నాయి.విరాట్ వయసు, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మాస్టర్ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి .వీరిద్దరికీ మినహా ప్రస్తుతం ఏ ఇతర బ్యాట్స్‌మెన్‌కు మాస్టర్ రికార్డును చేరుకునే అవకాశాల్లేవు.