ఆ బియ్యం వాడకం తో కాన్సర్ కు చెక్?

Sunday, February 18th, 2018, 06:38:13 PM IST

ఇటీవలి కాలంలో మన ఆహారపు అలవాట్ల వల్ల కాన్సర్ వ్యాధి బారిన పది మరణిస్తున్నవారి సంఖ్య ఒకింత మానవాళిని కుదిపేస్తోంది. రసాయనిక ఎరువులు వాడిన పంటను తినడం, అధిక దిగుబడిని, ఆదాయాన్నిస్తున్నాయని ఎక్కువమంది ఈ విధమైన నూతన విధానాల అవలంబన, మరీ ముఖ్యంగా సంప్రదాయ సేంద్రియ విధానాలకు తిలోదకాలు ఇవ్వడం వంటివి చేయడం వల్ల మనం తినే ఆహారంలో నాణ్యత కోల్పోయి వివిధ రకాల వైరస్ ల వ్యాప్తితో కాన్సర్ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ప్రస్తుతం కాన్సర్ నిర్మూలనకు తోడ్పడే మూడు రకాల సంప్రదాయ బియ్యం రకాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో లభించే గత్వాన్, మహారాజి, లైచా రకాలకు కేన్సర్ పై పోరాడే ఔషధ సుగుణాలు పుష్కలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త దీపక్ శర్మ అన్నారు.

రాయ్ పూర్ లోని ఇందిరాగాంధీ క్రిషి విశ్వవిద్యాలయం ఈ పరిశోధన నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మూడు బియ్యం రకాలకు ఊపిరితిత్తులు, బ్రెస్ట్ కేన్సర్ ను నయం చేసే గుణాలు ఉన్నాయని, అవి అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని చేయవని ఆయన తెలిపారు. ఈ మూడింటిలో లైచా అనే రకం బియ్యం కేన్సర్ కణాల పునరుత్పాదనకు పూర్తిగా నిర్మూలించడం తోపాటు వాటిని నిర్వీర్యం చేయడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని, అలానే గత్వాన్ రకానికి ఆర్థరైటిస్ ను నయం చేసే సుగుణాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా బస్తర్ ప్రాంతంలో లైచా, మహారాజి రకాల బియ్యాలను ఔషధ ప్రయోజనాల కోణంలో కొంత వరకు వినియోగిస్తున్నట్టు శర్మ తెలిపారు….