“పేటీఎం” తో ప్రలోభాలు – ఎన్నికల్లో నయా ట్రెండ్..!

Tuesday, November 27th, 2018, 01:29:37 PM IST

ఎన్నికలంటే డబ్బు, డబ్బుంటేనే ఎన్నికలు అన్న విధంగా తయారయ్యింది పరిస్థితి, అయితే ఎన్నికల సంఘం ఎంత కట్టడి చేసినా కూడా అభ్యర్థులు ఏదో ఒక రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల కాలంలో డబ్బు పంపిణి చేయటాన్ని ప్రత్యర్థులు సెల్ కెమెరాల్లో రికార్డ్ చేసి ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తున్నారు, అయితే ఎన్నికల్లో తమ వద్ద జన బలం ఉందని చుపంచుకోవాలంటే డబ్బులు వెదజల్లక తప్పని పరిస్థితి. దీంతో అభ్యర్థులు పేటీఎం ద్వారా డబ్బు పంపిణి చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు పట్నం నుంచి పెళ్లిదాకా పాకింది.

విద్యార్థులు, యువత, మహిళా సంఘాల సభ్యులు,కూలీలను ఇలా అందరికి డబ్బు పంపిణి చేసి పెయిడ్ కార్యకర్తలను తమ వెంట తిప్పుకుంటున్నారు. అసలే ఉరుకుల పరుగుల జీవితం కావటంతో నేతల వెంట తిరిగే కార్యకర్తలు కరువైపోయారు, దీంతో ఇలా పెయిడ్ కార్యకర్తలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. కూలీలను మినహాయిస్తే, మిగతా వారందరి చేతిలో స్మార్ట్ ఫోన్, ఆ ఫోన్లో పేటీఎం లాంటి యాప్స్, వాల్లెట్స్ కచ్చితంగా ఉంటాయి. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకున్న అభ్యర్థులు డిజిటల్ పేమెంట్స్ రూపంలో డబ్బు పంపిణి చేస్తున్నారు. ఈ తరహా డబ్బు పంపిణి జంట నగరాల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం అభ్యర్థుల దగ్గర కొంతమంది టీం కూడా పని చేస్తున్నట్టు తెలుస్తుంది.