ఇదో కొత్తరకం కేసు!

Tuesday, September 16th, 2014, 12:56:31 PM IST


అనంతపురం జిల్లా తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై స్థానికస్టేట్ బ్యాంక్ మేనేజర్ మంజులను దూషించిన వివాదంలో కేసు నమోదు అయ్యింది. దీనితో స్టేట్ బ్యాంకుల ముట్టడికి జేసీ అనుచరులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపధ్యంగా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాలలోకి వెళితే తాడిపత్రి స్టేట్ బ్యాంక్ ఏటీఎం వద్ద చిందరవందరగా పడి ఉన్న చెత్తను ఎమ్మెల్యే ప్రభాకర్ గమనించడంతో ఏటీఎం సెంటర్ పరిశుభ్రంగా లేదంటూ స్టేట్ బ్యాంకు మేనేజర్ కు ఫోన్ చేశారు. అయితే మేనేజర్ మజుల ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో మరోసారి కాల్ చేసిన జేసీ మేనేజర్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. దీనితో వారిరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో మంజుల జేసీ పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. మొదట ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నించిన పోలీసులు అది విఫలం కావడంతో గత్యంతరం లేక జేసీపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక దీనితో జేసీపై కేసు ఎత్తివేయాలంటూ ఆయన అనుచరులు ఆందోళనను చేపట్టి ఎస్బీఐ ను ముట్టడించే ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి