ఏపీ సీఎం జగన్‌కి షాక్.. నోటీసులు జారీ చేసిన సీబీఐ కోర్టు..!

Thursday, April 29th, 2021, 01:00:33 AM IST

ఏపీ సీఎం జగన్‌కి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అందువల్ల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గతంలో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీఎంపై అక్రమాస్తులకు సంబంధించి 11 కేసులు ఉన్నాయని, అన్నింటిలోనూ సీఎం ఏ1 ముద్దాయిగా ఉన్నారని బెయిల్‌పై ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని అందుకే జగన్ బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామకృష్ణంరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే తొలుత రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్‌ను సాంకేతిక కారణాలపై సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో కృష్ణంరాజు మరో వారం తర్వాత సవరించిన వ్యాజ్యాన్ని మరోసారి దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా విచారణ చేపట్టి సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వచ్చే నెల 7వ తేదీన సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది.