సీఎం జగన్‌కి కీలక పదవి కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వం..!

Tuesday, August 20th, 2019, 06:25:55 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే జగన్ ఎన్నికల ముందు నుంచే కేంద్రంలోని బీజేపీతో మంచి సన్నిహిత్యంగా ఉంటూ ముందుకు సాగాడు. అనుకున్నట్టే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండో సారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు.

అయితే ప్రస్తుతం ఏపీలో బీజేపీలోకి వలసలు పెరుగుతూ రోజు రోజుకు బీజేపీ పార్టీ బలపడుతున్నా జగన్‌తో ఇంకా స్నేహ సంభందాలే కొనసాగిస్తుంది తప్ప వైసీపీపై పెద్దగా విమర్శలు చేయడంలేదు. అయితే తాజాగా కేంద్రం నుంచి జగన్‌కి ఒక అదిరిపోయే ఆఫర్ వచ్చింది. అంతర్ రాష్ట్రాల మండలి స్థాయి సంఘం సభ్యునిగా సీఎం జగన్‌ని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి వైఎస్ జగన్ ఒక్కరికే ఈ పదవి లభించడం, జగన్ కన్నా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి రాజకీయ అనుభవం ఎక్కువగా ఉన్నప్పటికి జగన్‌నే ఎంపిక చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పదవులకు కేంద్ర ప్రభుత్వం ఇతర పార్టీ ముఖ్యమంత్రులలో నలుగురికి అవకాశం కల్పించింది. ఇందులో ఇద్దరు తటస్థులుగా, ఒకరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీకి చెందిన నాయకుడు కావడం, మరొకరు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం గమనార్హం. అయితే గతంలో అంతర్ రాష్ట్రాల మండలి స్థాయి సంఘం చైర్మెన్‌గా ప్రధాని మోదీ ఉన్నా ఇప్పుడు ఆ బాధ్యతలను కేంద్ర హోం శాఖ మంత్రికి అప్పచెప్పారు. ఏదేమైనా కేంద్రం జగన్‌కి ఈ అవకాశం కల్పించడంతో వైసీపీ శ్రేణులు కూడా బీజేపీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.