పప్పులో కాలేసిన కేంద్ర మంత్రి.. న్యూటన్‌ని ఐన్‌స్టీన్‌గా మార్చాడు..!

Thursday, September 12th, 2019, 08:27:23 PM IST

మనిషి జీవితంలో తప్పులు జరగడం అనేవి సాధారణం. అయితే ఏ తప్పయినా పెద్దగా అనిపించదేమో కానీ నోటీ మాట జారిందో ఇక అంతే. ఏదో ఆలోచనలో ఏదో ఒకటి మాట్లాడబోయి ఏదో ఒకటి మాట్లాడితే నలుగురిలో అపహాస్యం పాలు కాక తప్పదు. అయితే సాధారణ మనుషులు అప్పుడప్పుడు నోరు జారినా అది పెద్ద విషయం అనిపించుకోదు. అదే ఒక హొదాలో ఉన్న వ్యక్తి లేక పెద్ద సెలబ్రెటీ ఇలా ఎవరి నోట అయిన తప్పు దొర్లిందో అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

అయితే తాజాగా వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బ్లండర్ మిస్టేక్ ఒకటి చేసారు. ఇంకేముంది ఆయన నోటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆర్థిక మాంద్యం గురుంచి మీడియాలో వస్తున్న వార్తలపై మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఐన్‌స్టీన్ ఇలాంటి లెక్కలను నమ్ముకుంటే గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనిపెట్టేవారు కాదని అన్నారు. అయితే గురుత్వాకర్షణ సిద్దాంతాన్ని కనిపెట్టింది న్యూటన్ అయితే మంత్రి గారేమో ఐన్‌స్టీన్ పేరు చెప్పి నోరు జారారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో మంత్రిగారిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కేంద్రమంత్రి హోదాలో ఉండి ఇలాగా నోరు జారడం సరికాదని కొందరు అంటుంటే, మరికొందరేమో ఐన్‌స్టీన్‌కి, న్యూటన్‌కి తేడా తెలియని వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉండడం బాధాకరమని తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మంత్రిగారు ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారనేదే తెలియాల్సి ఉంది.