ఋణం తీర్చుకుంటున్న చైనా – ఇండియా కి బంపర్…?

Thursday, March 26th, 2020, 11:22:27 AM IST

చైనా దేశంలో పుట్టి పెరిగిన భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ గత కొంత కాలంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా వణికిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వైరస్ వలన కొన్ని వేలాది మంది చైనీయులు మరణించినప్పటికీ కూడా, ప్రస్తుత కాలంలో చైనా లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదవడం లేదు. అన్ని కట్టుబాట్లతో చైనా, ఈ కరోనా వైరస్ పై విజయం సాధించింది. కాగా చైనాలోని వూహాన్ లో ఈ భయంకరమైన కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తరువాత, మన భారత ప్రభుత్వం ఇక్కడి నుండి చైనా కి ఒక ప్రత్యేక విమానంలో వైద్య పరికరాలు, మందులను, మాస్కులను పంపి, చైనా ప్రజలకి అండగా నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అంటే దాదాపుగా ఈ నెలారంభంలో చైనాకు ఇండియా నుంచి 15 టన్నుల వైద్య పరికరాలు వెళ్లాయి. మాస్క్ లు, గ్లవ్స్, అత్యవసర ఔషధాలను ఇండియా పంపింది.

అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్నీ ప్రస్తావించిన చైనా, ఈ విషయంలో భారత ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూనే, భారత్ లో ఈ భయంకరమైన వైరస్ పై పోరాటాన్ని చేయడానికి తాము సిద్ధమని చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చైనా ఎంబసీ కౌన్సిలర్ జీ రాంగ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి భారతదేశానికి సాయం చేయడానికి చైనా సిద్ధంగాఉంది. ఇండియాకు ఎటువంటి అవసరం వచ్చినా, చేతనైనంత సాయపడుతూ, మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ ఎంబసీ అధికారి తెలిపారు. అంతేకాకుండా ఈ పోరాటంలో సమాచార మార్పిడి, పరస్పర సహకారం కీలకమని ఆ చైనా అధికారిని వెల్లడించారు.