గడ్డం గీయించుకో.. ప్రధాని మోదీకి రూ.100 పంపిన టీ స్టాల్ యజమాని..!

Thursday, June 10th, 2021, 01:03:40 AM IST

కరోనా నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక, ఉద్యోగాలు కోల్పోతూ తినడానికి కూడా తిండి దొరక్క చాలా మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి వినూత్న పద్ధతిలో ఓ టీ స్టాల్ యజమాని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాడు. మహారాష్ట్రలోని బారామతికి చెందిన అనిల్‌ మోరే అనే వ్యక్తి ప్రైవేట్‌ ఆసుపత్రి ఎదురుగా టీ కొట్టు నడుపుతున్నాడు.

అయితే ప్రధానమంత్రి మోదీ గడ్డం పెంచుతూ పోతున్నారని, ఇకపై ఆయన ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడేదిలా ఉండాలని లేఖ రాశాడు. అంతేకాదు మోదీ వెంటనే గడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు మనియార్డర్ కూడా పంపాడు. మోదీ గడ్డం పెంచడం మాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని, లాక్‌డౌన్‌ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి వారిని బయటపడేయాలని అన్నారు. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం అని ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, కరోనాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ విధంగా చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఇది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.