రివ్యూ రాజా తీన్‌మార్ : ‘ఛలో’ – ఛల్ తా హై

Saturday, February 3rd, 2018, 10:00:06 AM IST

తెరపై కనిపించిన వారు : నాగ శౌర్య, రష్మిక మందన్న

కెప్టెన్ ఆఫ్ ‘ ఛలో’: వెంకీ కుడుములు

మూల కథ :

చిన్నప్పటి నుండి హరి (నాగ శౌర్య)కి గొడవలంటే చాలా ఇష్టం. అందరు పిల్లలు ఆడుకుని ఆనందిస్తే హరి మాత్రం కొట్లాటల్లో సంతోషాన్ని పొందుతుంటాడు. అలా అతను పెరుగుతున్న కొద్ది గొడవలు కూడా ఎక్కువవుతుంటాయి.

దాంతో వాళ్ళ నాన్న అతన్ని హైదరాబాద్ నుండి ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో ఉండే తిరుప్పురం అనే ఊరికి పంపిస్తాడు. కానీ ఆ ఊళ్ళో జనాలు మాత్రం రెండుగా విడిపోయి పగ ప్రతీకారాలతో బ్రతుకుతుంటారు. హరిని వాళ్ళ నాన్న ప్రత్యేకంగా అలాంటి ఊరికే ఎందుకు పంపాడు, ఆ ఊరి గొడవేంటి, ఆ ఊరు హరి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేదే సినిమా.

విజిల్ పోడు :

–> దర్శకుడు వెంకీ కుడుములు కొద్దిగా కొత్తదనమున్న కథకు మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమానౌ తెరకెక్కించిన తీరు అభినందనీయం. మొదటి విజిల్ ఆయనకే వేయాలి.

–> సినిమా ఇంటర్వెల్ సమయానికి ఊహించని మలుపు తిరగడం చాలా బాగుంది. హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్ కూడా సరిపడే విధంగా ఉంది.

–> ఇక సినిమాలో ఎక్కువగా ఆకట్టుకునేది సత్య, వైవా హర్ష, వెన్నెల కిశోర్ ల కామెడీ. ప్రతి 10 నిముషాలకు ఒక మంచి కామెడీ సీన్ వచ్చి బాగా నవ్వుకునేలా చేసింది. కాబట్టి మూడో విజిల్ కామెడీకే వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

–> కథకు కీలకమైన ఊరి గొడవను దర్శకుడు మొదటి నుండి సీరియస్ గా చూపించి చివరకు చాలా సిల్లీగా ఓపెన్ చేయడం బాగోయలేదు.

–> సినిమలో బలమైన ప్రభావం చూపాల్సిన కీలకమైన మలుపుల్ని కూడా కామెడీ కోసం వాడేసుకోవడంతో వాటిలో తీవ్రత కనబడలేదు.

–> కొన్ని దశాబ్దాల పాటు కొట్టుకున్న ఊరి జనాలు కలిసిపోనుంది అని చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క సెకన్లలో కలిసిపోవడం, కథ సుఖాంతమవడం నిరుత్సాహానికి గురిచేసింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

–> ఈ చిత్రంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయాలేమీ లేవు.
చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : మంచి ఫన్ దొరికింది కదా
మిస్టర్ బి : కథలో కొద్దిగా సీరియస్ నెస్ ఉంటే ఇంకా బాగుండేది.
మిస్టర్ ఏ: అవునవును.
మిస్టర్ బి : అయినా పర్లేదులే.. ఈ మాత్రం కంటెంట్ ఉంటే చాలు సినిమా ఛల్ తా హై.