ఎమ్మెల్యేలకు పెద్ద బాధ్యత అప్పగించిన చంద్రబాబు – ఎందుకంటే…?

Tuesday, June 11th, 2019, 11:42:15 PM IST

ఏపీలో ఇప్పుడు శాసన సభ సమావేశాలు జరగనున్నాయి… ఈ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నాడని సమాచారం. ఈ సమావేశాల తొలిరోజు అందరూ పసుపు చొక్కాలతో అసెంబ్లీకి హాజరుకావాలని, ఉదయం 9.30 గంటలకల్లా ఉండవల్లిలోని అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అక్కడ్నుంచి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే నాయకుల సామర్థ్యం బయటపడుతుందని చంద్రబాబు చెప్పారు. కాగా ఈ సమావేశాల్లో తన కంటే మిగతా టీడీపీ ఎమ్మెల్యేల గొంతే ఎక్కువగా వినబడాలని, పార్టీ కోసం, ప్రజల కోసం ఎక్కువగా మాట్లాడాలని చంద్రబాబు సూచించారు.

అంతేకాకుండా కార్యకర్తల్లో, నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంచాలని, సమస్యల పరిష్కారంపై పోరాట పటిమ ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఇటీవల టీడీపీ కార్యకర్తలపై జరిగినటువంటి దాడులపై సమావేశానికి హాజరైన సభ్యులందరు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగానే ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాగా భవిష్యత్తు కార్యాచరణపై ద్రుష్టి సారించాలని, జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీ తరపున ఏం చేయాలనే అంశంపై కార్యాచరణను రూపొందిద్దామని స్పష్టం చేశారు.