మళ్ళీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా.. జగన్‌కి చంద్రబాబు సవాల్..!

Monday, January 13th, 2020, 07:06:36 PM IST

ఏపీ రాజధాని అమరావతి రైతుల నిరసనలకు మద్ధతుగా అమరావతి పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. అనంతపురం జిల్లా పెనుగొండ యాత్రలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జోలెపట్టి విరాళాలు సేకరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్‌కు సవాల్ విసిరారు.

ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించాలంటే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని, ఆ ఎన్నికలలో వైసీపీ గెలిస్తే అమరావతి రాజధానిని విశాఖకు మార్చినా తాను అభ్యంతరం తెలపనని అన్నారు. అలా జరిగితే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. అయితే ప్రజలంతా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు.