ఆ చిన్నారి పాటకు చంద్రబాబు ఫిదా.. మనసారా అభినందనలు..!

Saturday, March 6th, 2021, 10:09:32 AM IST

తెలుగు భాషపై ఓ చిన్నారికి ఉన్న మక్కువను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫిదా అయ్యారు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పేలా “వీణియ నాద వినోదంలా.. తేనియ మధురిమ సారంలా” అనే పాటను సిద్దిపేట జిల్లా వర్గల్ జడ్పీ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు అమరవాది రాజశేఖర శర్మ రచించారు. అయితే గుంటూరు జిల్లా సత్తెనపల్లి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని జిమీని యామూన్ ఈ పాటను ఎంతో చక్కగా పాడింది. ప్రస్తుతం ఈ చిన్నారి ఆలపించిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు నాయుడు తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ.. ఎంతో శ్రావ్యంగా గానం చేసిన ఈ 6వ తరగతి చిన్నారిని మనసారా అభినందిస్తున్నానని, ఈ పాట సాహిత్యాన్ని వింటుంటే ప్రజలకు తెలుగు భాష మీద ఉన్న మమకారం స్పష్టమవుతోందని అన్నారు. అలాంటి తెలుగు భాషను పాలకులు కనుమరుగు చేయాలనుకోవడం ప్రజల అభీష్టానికి వ్యతిరేకం, దారుణమని అన్నారు.