కియా సంస్థను ఎవరు బెదిరించారు?–జగన్ సర్కార్ కి చంద్రబాబు వరుస ప్రశ్నలు!

Thursday, February 13th, 2020, 07:29:26 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకసారి జగన్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని తీవ్రంగా దుయ్యబట్టారు. కియా పరిశ్రమకు వెళ్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి కారుని పోలీసులు వెంబడించి మరి అరెస్ట్ చేయడం ఏమిటి అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయనేమైనా నేరస్తులా అంటూ ధ్వజమెత్తారు. అనంతపురంలో సిపిఐ నేతలు గృహ నిర్బంధాన్ని,అక్రమ అరెస్టులని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

అయితే కియా పరిశ్రమ గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందేనని అన్నారు. కియా తమిళనాడుకు తరలిపోతుందని వార్త రావడం,ఆ వెంటనే కియా ప్రతినిధులతో వైసీపీ నేతలు ఇది నిజం కాదని చెప్పించడం,మరుసటి రోజే మేము రాసింది నిజమే అంటూ జాతీయ పత్రిక చెప్పడం ఏమిటిఇవన్నీ అని ఘాటుగా ప్రశ్నించారు. తేరా వెనుక జరిగిందేమిటి? కియా సంస్థని ఎవరు బెదిరించారు? ఎవరు వేధించారు? వార్తల్లో నిజానిజాలేమిటి, ప్రజలకు తెలియొద్దా అంటూ ప్రశ్నలు వేశారు. వాస్తవాలని నిర్దారించుకోవడానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేసారంటే ఇందులో ప్రభుత్వం దాస్తున్న అంశాలేమిటి అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే సిపిఐ నేతలను విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి.