అభివృద్ధి ఒప్పందాన్ని జగన్ కూల్చేశారు – చంద్రబాబు విచారం

Wednesday, November 13th, 2019, 02:20:13 AM IST

ఆంధ్రప్రదేశ్ లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసమని సింగపూర్ ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విరమించుకోవడం అనేది చాలా దారుణమని, ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని, తన మీదున్న కక్షతో, కుట్రపూరితంగా ఆలోచిస్తూ సీఎం జగన్ ఇలా రద్దు చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ విషయంలో తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు.

కాగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో ఏర్పాటు చేసుకున్న కలల సౌధాన్ని సీఎం జగన్ కాలదన్నాడని, రాజధాని నిర్మాణం పై పెట్టుకున్న ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమేరకు చంద్రబాబు “సింగపూర్ ప్రభుత్వం ఆనాడు మాతో అమరావతి నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సరికొత్త ఆశలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పొంగిపోయింది. కానీ నేడు కల చెదిరింది. పెట్టుబడులు వెళ్లిపోయాయి, నమ్మకం మంటగలిసింది. వినాశనం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోంది” అంటూ తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు.