రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ – ఏమన్నారంటే…?

Monday, November 11th, 2019, 11:05:39 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత అంశం రోజురోజుకు చాలా తీవ్రంగా మారుతుంది. ఈ ఇసుక కొరత విషయంలో రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూడలేక రాష్ట్రంలోని విపక్షాలు అన్ని కూడా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. కాగా తాజాగా ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే గతంలో తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేశామని, అపుడు ఎలాంటి సమస్యలు ఏర్పడలేదని చెప్పాడు. కానీ కొత్త ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన పద్దతుల వలన చాలా సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వలన కొన్ని లక్షల మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దాదాపుగా ఇప్పటి వరకు 40 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు తన లేఖలో వివరించారు. అంతేకాకుండా వరదల కారణంగా ఇసుక రవాణా జరగట్లేదని ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని చంద్రబాబు ఆరోపించారు. కాగా ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక కొరత విషయంలో స్పందించి రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల భృతి ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.