క‌ల్తీ కారంకు ఉన్న విలువ‌, పండించిన మిర్చికి లేదే!

Sunday, January 22nd, 2017, 11:54:02 AM IST

mirchi-farmersమిర్చి రైతుల కంట్లో కారం కొడుతున్న స‌న్నివేశ‌మిది. ఆరుగాలం శ్ర‌మించి మిర్చి పంట చేతికొచ్చాక ద‌ళారులు చేతివాటం చూపించ‌డం, ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోవ‌డం వంటి ఊహించ‌ని విప‌త్తుతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ‌లో ఇదే స‌న్నివేశం. దీనికి ప్ర‌భుత్వాల మ‌ద్ధ‌తు మాట అటుంచితే ప్ర‌భుత్వాలే మోసం చేసిన స‌న్నివేశం బ‌య‌ట‌ప‌డింది. ఓ అధికారిక లెక్క ప్ర‌కారం ఏపీలో ఒక్క గుంటూరులోనే రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల్లో మిర్చి పంట పండించారు. ఇటు తెలంగాణ‌లో ఖ‌మ్మంలో ల‌క్ష‌న్న‌ర ఎక‌రాల పంట పండించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగానూ ఈసారి భారీగానే మిర్చి పంట వేశారు. అయితే పంట ఫ‌క్వానికి వ‌చ్చి మార్కెట్లోకి తెచ్చే వేళ ధ‌ర‌లు మాత్రం దారుణంగా మ‌గ్గిపోయాయ్‌. ఎర్ర బంగారం (పండుమిర్చి) ధ‌ర‌లు అంతే దారుణంగా ప‌డిపోయాయ్‌. పైపెచ్చు మిర్చి రైతును వెంటాడే ద‌ళారీ వ్య‌వ‌స్థ రైతును స‌గం బొంద పెడుతోంది.

ఈ ధైన్యంపై మిర్చి రైతు దారుణంగా వ్య‌థ చెందుతున్నా ప్ర‌భుత్వాల అండ‌దండా లేక‌పోవ‌డం శోచ‌నీయం. విత్త‌నాలు కొనే ద‌శ నుంచి నారు మ‌డి త‌డిపే ద‌శ‌లో, పంట చేతికొచ్చే ద‌శ‌లో ఇలా ప‌లు ద‌శ‌ల్లో మిర్చి రైతు భారీగా పెట్టుబ‌డులు గుమ్మ‌రించుకోవాల్సిన ప‌రిస్థితి. తీరా పంట చేతికొచ్చేప్ప‌టికి లోపాయికారీ వ్య‌వ‌స్థ‌లో దారుణంగా న‌ష్ట‌పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ‌త ఏడాది ధ‌ర‌లు బావున్నాయి క‌దా.. అని ఈసారి రెట్టింపు పెట్టుబ‌డులు పెట్టామ‌ని రైతులు వాపోతున్నారు. తెలంగాణ‌లో అయితే ప్ర‌తి పంట బ‌దులుగా మిర్చి వేయాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆ మేర‌కు ప్ర‌త్తి పంట వ‌దులుకుని, మిర్చి వేస్తే వాటికి స‌రైన ధ‌ర‌ల్లేక‌, భారీగా పెట్టుబ‌డులు పెట్టి న‌ష్ట‌పోయామ‌ని రైతులు వాపోతున్నారు. మ‌రి ఇరు రాష్ట్రాల సీఎంలు మిర్చి రైతును ఆదుకునే దిశ‌గా చ‌ర్య‌లేవైనా చేప‌డ‌తారేమో చూడాలి. లేదంటే ల‌క్ష‌లాది మిర్చి రైతు కుటుంబాల‌కు క‌న్నీళ్లే మిగులుతాయ్‌! కల్తీ కారంకు ఉన్న విలువ పండించిన మిర్చికి లేక‌పోయే. వేలాది క‌ల్తీ కారం బ‌స్తాలు పోలీసుల‌కు చిక్కుతున్నాయి. దేవుడ‌!