చిరంజీవిగారు ఇకనైనా పవన్, కత్తి వివాదం లో జోక్యం చేసుకోవాలి : కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి

Sunday, January 14th, 2018, 01:02:42 AM IST

తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షులు, త్వరలో రాబోవు ‘లక్ష్మీస్ వీర గ్రంధం’ చిత్ర దర్శకులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పవన్, కత్తి మహేష్ ల వివాదం పై ఇకనైనా మెగాస్టార్ చిరంజీవి జ్యోక్యం చేసుకుని ఈ సంక్రాంతి తో వివాదానికి ఒక ముగింపు పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ లో మంచి మనసున్న వ్యక్తిగా, ప్రతిఒక్కరిని ఎంతో ఆత్మీయంగా పలకరించే చిరంజీవి, ఇదివరకు నటుడు రాజశేఖర్ పై ఆయన అభిమానులు దాడి చేసినపుడు జరిగిన దుర్ఘటన కు చింతిస్తూ రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన అభిమానుల వాల్ల వారి కుటుంబానికి జరిగిన ఇబ్బందికి తాను బాధ్యత వహిస్తూ క్షమాపణ అడిగారు, అంతటి గొప్ప మనసున్న మహనీయుడు చిరంజీవి అని ఆయన అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా నిజాయితీ గల వ్యక్తి అని, తన గుణగణాలను బట్టి ఎవరికీ తలవంచని వ్యక్తి అనీ, గతంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ యువజన నాయకుడు గా వున్నపుడు కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి వారి పంచలు ఊడగొడదాం అన్న సంఘటనను ఆయన గుర్తు చేశారు. నీతి, నిజాయితీ గల ఏ వ్యక్తికైనా ఆవేశం తప్పక ఉంటుందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో పవన్ టిడిపి కి మద్దతు ఇచ్చారని, ఆ పార్టీ విజయానికి ఆయన భాగస్వామ్యం కూడా వుందన్నారు. ఇక భవిష్యత్తు రాజకీయాలంటారా, జనసేన అనేది కొత్తగా ఇప్పుడే నెలకొల్పిన పార్టీ కాబట్టి, రాబోవు ఎన్నికల్లో చంద్రబాబు కో, బిజెపి కో లేదా మరి ఏ ఇతరపార్టీ కి మద్దతిస్తారు, లేదా ఇండిపెండెంట్ గా నిలబడతారనేది ఇప్పుడు అనవసరమని అన్నారు.

కాబట్టి పవన్ అభిమానులు కత్తి మహేష్ చేస్తున్న విమర్శలకు ప్రతి విమర్శ చేయకుండా, ప్రశ్నించే హక్కుతో పార్టీపెట్టిన పవన్ జనసేన ద్వారా వారు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజా కార్యక్రమాలు చేయించేలా చూడాలన్నారు. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఆ పార్టీ వారు అప్పటి అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారని, అయితే తరువాత పరిస్థితుల రీత్యా అదే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు, అవకాశం లేనపుడు అవసరాన్ని బట్టి నడుకుకోవడమే రాజకీయ సిద్ధాంతమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పవన్ అభిమానులు తెలుసుకుని ఆయన పేరుతో మరిన్ని సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని అన్నారు. అయితే దాదాపుగా మూడు నెలలనుండి సాగుతున్న ఈ వివాదం వల్ల తాను చాలా కలత చెందానని, పవన్ కు అనుకూలంగా కొందరు , కత్తి మహేష్ కి అనుకూలంగా కొందరు మాట్లాడుతుంటే మూడవ రకం వ్యక్తులు అయిన కొంతమంది ఈ వివాదంపై నవ్వుకుంటున్నారని, తద్వారా మెగా ఫామిలీ అప్రతిష్ట పాలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరుగుతుంటే మనకెందులే అన్నట్లు కూర్చుంటే పోయేది చిరంజీవి గారి కుటుంబ పరువే అన్నారు. ఈ విషయం ఇపుడు వ్యక్తిగత విమర్శలు చేసేవరకు వెళ్లిందని, గోటితో పోయేది ఇప్పుడు గొడ్డలి దాకా వచ్చిందని, మిమ్మల్ని అమితంగా అభిమానించే మా ఈ విన్నపాన్ని మన్నించి మీరు ఇకనైనా కత్తి మహేష్ ని పిలిపించి ఆయనకు కలిగిన ఇబ్బందిని తెలుసుకుని, ఆపై వివాదానికి తప్పకుండా ముగింపుపలకాలని కోరారు. ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా, లేక ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా నష్టపోయేది ఆకెనని, ఒక్క మన స్థానం తీసి పక్కన పెడదాం బాస్, దయచేసి గ్రహించండి, ఇట్లు ప్రేమతో మీ విధేయుడు కేతు రెడ్డి అని తన ఆవేదనని ఆయన తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియచేసారు.