చిరుమ‌ర్తి : భ‌ట్టి, ఉత్త‌మ్ తెలంగాణ ద్రోహులు

Thursday, June 13th, 2019, 02:13:05 PM IST

కాంగ్రెస్ పార్టీని వీడి తెరాస‌లో క‌లిసిన చిరుమ‌ర్తి లింగ‌య్య కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్కపై నిప్పులు చెరిగారు. ఈ ఇద్ద‌రు ముఖ్య నాయ‌కుల‌పై లింగ‌య్య‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఇద్ద‌రూ తెలంగాణ ద్రోహులు. తెరాస‌లో కాంగ్రెస్ సీఎల్పీని విలీనం చేసింద‌ని ఇప్పుడు దీక్ష‌లు చేస్తున్న నాయ‌కులు పద‌వుల్ని ప‌క్క‌న పెట్టి తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎందుకు దీక్ష‌లు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.

ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన డ‌బ్బుల్ని తెచ్చుకుని నిర్ల‌జ్జ‌గా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పంచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పార్టీలో ద‌ళిత నేత‌ల‌ను గౌన‌వించే సంస్కారం భ‌ట్టీకి లేద‌ని, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పార్టీలో ముఖ్య‌మంత్ర‌ల్లా ఫీల‌వుతుంటార‌ని లింగ‌య్య విరుచుకుప‌డ్డారు. తెరాస‌కు మేము అమ్ముడు పోయామ‌ని భ‌ట్టి, ఉత్త‌మ్ నిరూపిస్తే వెంట‌నే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని, లేదంటే ఆ ఇద్ద‌రు రాజీనామా చేస్తారో చెప్పాల‌ని స‌వాల్ చేశారు.