మెగా స్టార్ 150 వ సినిమా హిట్ అయితే ఓకే… మరి ఫట్ అయితే.. చిరు దారెటు…?

Friday, November 4th, 2016, 02:14:48 PM IST

kaidhi-number-150
చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశానంతరం సినిమా పరిశ్రమకు చాలా దూరమయ్యారనేది అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాలపై దృష్టి సారించారు. చిరంజీవి 150 వ సినిమా విడుదల అవుతుందని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుతుంది. రాజకీయాలకు కాస్త విరామాన్ని ప్రకటించిన మెగా స్టార్ తన 150 వ సినిమా పై ప్రధానంగా దృష్టి సారించారు. మొదట సినిమాల్లో మెగా స్టార్ గా రాణించిన చిరంజీవి ఆ తర్వాత ఆ స్టార్ ఇమేజ్ తోనే రాజకీయ అరంగేట్రం చేసి 2009 ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ పై సమారానికి సిద్ధమయ్యి ఆశించినన్ని సీట్లను గెలుచుకోలేక,

కోరుకున్న స్థానాన్ని దక్కించుకోలేదని మదనపడుతున్న చిరుకు సోనియాగాంధీ గాంధీ బంపర్ ఆఫర్ ఇచ్చి, తన పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తే కేంద్ర మంత్రి పదవి కట్టబెడతానని ఆశను రేకిత్తించడంతో, యుపీఏ గాలానికి చిక్కిన చిరు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత అనుకోని విధంగా, ఎవరి ఊహకు అందని విధంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. దాని ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. దీనిని మెచ్చని ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోర పరాజయం పాలుజేశారు.

అయితే అప్పుడు ఆలోచనలో పడ్డ చిరంజీవి తన సినిమా ప్రస్థానాన్ని మళ్లీ కొనసాగించాలని నిశ్చయించుకున్నారట…! అయితే ఇప్పుడు చిరంజీవి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్లుగా తయారైంది. తెలుగు సినిమా మెగాస్టార్ ప్రేక్షక అభిమానులంతా చిరంజీవి 150 వ సినిమా పై ప్రేక్షక అభిమానులంతా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రాజకీయాల్లో విఫలమై సిమాల్లోకి మళ్లీ ప్రవేశిస్తున్న చిరు సినిమాల్లో కూడా విఫలం అవుతే… పరిస్థితి ఏంటి…? చిరు ఇక సినిమాల జోలికి కూడా వెళ్లరా…? దీనికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది.

ఏది ఏమైనా ప్రస్తుతం చిరంజీవి ముందు ఉన్న పరిస్థితులు మాత్రం చాలా క్లిష్టంగానే ఉన్నాయని చెప్పవచ్చు. చిరంజీవి తీసుకోబోయే ఏ నిర్ణయాలైనా తన భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చుపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చిరంజీవి తన రాజకీయ ప్రయాణాన్ని కోటి ఆశలతో ప్రారంభించినా చివరికి అది ఆయనకి నిరాశనే మిగిల్చాయి. మొదట పార్టీని స్థాపించిన సమయంలో సామాజిక వేత్తలు, కొందరు బడా రాజకీయ నాయకులు పార్టీకి అండగా నిలబడ్డా ఆ తర్వాత పార్టీ వ్యక్తుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అయింది.

పార్టీ కి అవినీతి మసి అంటి పార్టీకి ప్రజల్లో ఆదరణ కరువైంది. పార్టీని స్థాపించినా దానిని నడిపించే రథ సారథులు పార్టీకి కరువవ్వడం పెద్ద దెబ్బ తీసింది. పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. ఫలితం చిరుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అటు రాజకీయాల్లో ప్రజల మనసుల్ని గెలుచుకోలేక, ఇటు సినిమాల్లో మళ్లీ ప్రజలు ఆదరిస్తారో లేదో తెలియక చిరు సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రజనీకాంత్ సినిమా కబాలి విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. దానికి ప్రజాధారణ లభించింది మాత్రం అంతంతమాత్రమే. ఒక రజనీ సినిమాకే అలాంటి పరిస్థితి ఎదురైతే రేపు చిరంజీవి పరిస్థితి మరి…!!