మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్.. మార్ఫింగ్ వీడియోపై సీఐడీ నోటీసులు..!

Thursday, April 15th, 2021, 03:45:20 PM IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7న తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దేవినేని ఉమా సీఎం జగన్‌కు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియోని ప్లే చేశారంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కు చెందిన నాయకులు ఉమాపై ఫిర్యాదు చేశారు. దీనిపై దేవినేని ఉమాపై సెక్షన్ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) కింద సీఐడీ కేసులు నమోదు చేసి, నోటీసులు జారీ చేశారు.

అయితే ఈ రోజు ఉదయం 9:37 గంటలకు గొల్లపూడిలోని దేవినేని ఉమ ఇంటికి వెళ్ళిన సీఐడీ అధికారులు ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఈ రోజే ఉదయం 10:30 గంటలకు కర్నూలు సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా విచారణకు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన దేవినేని ఉమా సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను నెల్లూరు జిల్లాలో ఉంటే ఈ రోజు ఉదయం 10.30 గంటలకు కర్నూలు సీఐడీ ఆఫీసులో హాజరవ్వమని గొల్లపూడిలోని నా నివాసానికి నేడు నోటీసులు అంటించడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.