ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.
అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తున్న జగన్ ప్రభుత్వం కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టించింది. అయితే కరకట్టపై చంద్రబాబు నివాసం లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉండడంతో ఆ గెస్ట్హౌస్తోపాటు మరికొన్ని అక్రమ కట్టడాలకు అధికారులు ఇప్పటికే నోటీసులు కూడా అందజేశారు. అయితే ఇదే విషయం అసెంబ్లీ సమావేశాలలో నేడు చర్చకు వచ్చింది. అయితే దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ కేవలం తనపై కక్షతోనే ఆ భవనాన్ని కూల్చేశారంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్పై ఆరోపణలు చేసారు. అయితే గతంలో వైఎస్ఆర్ విగ్రహాలను వేల సంఖ్యలో అక్రమ స్థలాల్లో ఏర్పాటు చేశారని, విజయవాడ నడిబొడ్డున అక్రమంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం తీయించందని గుర్తు చేసారు.
అయితే తమ అభిమాన నాయకుడిని అవమానించేలా మాట్లాడుతుండడం, వైఎస్ఆర్ విగ్రహాల తొలగింపు అంశాన్ని తప్పుపడుతూ అధికారపార్టీ సభ్యులు పెద్ద ఎత్తున చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీ రికార్డుల నుంచి చంద్రబాబు మాటలను తొలగించాలని పోడియంలో కూర్చున్న అధికారులను కోరాడు. అయితే అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆప్త నాయకుడు వైఎస్ఆర్ అని మీరు బాధ పడుతున్న దానిని ఒక బీసీ నాయకుడిగా నేను అర్ధం చేసుకుంటానని, మీకు ఉన్నటువంటి హక్కులను పరిరక్షించినప్పుడే తాను కూర్చున్న కుర్చీకి న్యాయం చేసిన వాడిని అవుతానని, మీ హక్కులను పరిరక్షించలేనప్పుడు తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటానంటూ తమ్మినేని సీతారం అన్నారు. అయితే తమ్మినేని ఒక్కసారిగా అలా మాట్లాడడంతో జగన్తో సహా ప్రతి వైసీపీ సభ్యుడు తమ్మినేనిని కరతాల ధ్వనులతో అభినందించారు.