సీఎం జగన్ డిఫరెంట్ థింకింగ్.. కలెక్టర్లకు విందు పార్టీ..!

Sunday, December 15th, 2019, 02:16:54 AM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలలలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచిపోవడంతో ప్రతి జిల్లా సమస్యలను, జరిగే పనులను గురుంచి తెలుసుకోవాలని సీఎం జగన్ సరికొత్త ప్రయత్నం చేయబోతున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఈ నెల 17న విందు పార్టీనీ ఇవ్వబోతున్నారు.

అయితే అధికారం చేపట్టిన కొత్తలోనే ప్రతి మంగళవారం అందరు కలెక్టర్లు, ఎస్పీలతో కలసి ఓ కాఫీ మీట్ నిర్వహిద్దామని జగన్ చెప్పినా అది వీలు కాకపోవడంతో ఈ విందు పార్టీనీ ఏర్పాటు చేశారు. అయితే అమరావతిలో జరిగే ఈ విందు సమావేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అయితే ఒక్కో జిల్లాకు ఒక్కో టేబుల్ ఏర్పాటు చేస్తున్నారట. అంతేకాదు ఒక్కో టేబుల్ దగ్గర ఉన్న ఆయా జిల్లా అధికారులతో జగన్ 10 నిమిషాల పాటు చర్చించి ఆ జిల్లా పూర్తి సమాచారాన్ని తెలుసుకోనున్నారట. అంతేకాదు ఆయా జిల్లాలలో సీఎం దగ్గరకు వచ్చిన కంప్లెయింట్‌ల గురుంచి కూడా అధికారులతో చర్చించే అవకాశాలు ఉన్నాయట.