ఇట్స్ ఫైనల్: ఏపీ స్పీకర్ ఎవరో తేల్చేసిన సీఎం జగన్..!

Friday, June 7th, 2019, 03:15:51 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ నెల 8వ తేదిన తన మంత్రివర్గ జాబితాను ప్రకటిస్తానని జగన్ ఇదివరకే ప్రకటించారు. అయితే జగన్ మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం లభిస్తుందో అనే దానిపై అందరిలోనూ సర్వత్రా ఆసక్తి కనబడింది. అంతేకాదు స్పీకర్‌గా కూడా ఎవరికి స్థానం కలిపిస్తారు అనే దానిపై కూడా కొంత ఆసక్తి కనపడింది. అయితే వీటన్నిటికి నేటితో తెరపడనుంది.

అయితే ఏపీ కొత్త స్పీకర్‌గా ఎవరు ఎంపిక కాబోతున్నారనే విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో హాట్ టాఫిక్‌గా నడుస్తుంది. అయితే నేడు జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో సీఎం జగన్ స్పీకర్ పదవిని ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు అప్పచెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌తో పాటు మంత్రిస్థానం కోసం తమ్మినేని సీతారాం కూడా పోటీ పడుతున్నారు. అయితే జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌లలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి తమ్మినేనికి స్పీకర్ పదవి ఇవ్వలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని ఇప్పటి వరకు మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన తమ్మినేని ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2014లో కూడా ఓటమి పాలైనా ఈ సారి మాత్రం వైసీపీ నుంచి ఎమ్మ్మెల్యేగా గెలుపొందారు. గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పని చేసిన అనుభవం తమ్మినేనికి ఉండడంతో స్పీకర్ పదవికి ఆయనే కరెక్ట్ అని భావించి జగన్ ఆయనను స్పీకర్‌గా ఎంపిక చేశారట.