జగన్ కోసం మళ్ళీ రంగంలోకి దిగనున్న పీకే.. ఈ సారి ఎందుకంటే..!

Tuesday, November 19th, 2019, 05:13:27 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడిచినా కూడా ఏపీ రాజకీయాలలో మాత్రం ఇంకా వేడి తగ్గలేదనే చెప్పాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అరు నెలలలో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందుకు తగ్గట్టుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నా, కొన్ని కొన్ని విషయాలలో మాత్రం విమర్శలను ఎదురుకోవలసి వస్తుంది.

అయితే తాజాగా రాజధాని అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. రాజదాని అమరావతిలో సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టును జగన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో దానిని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జర్నలిస్ట్‌లు తప్పుబడుతున్నారు. అంతేకాదు ప్రముఖ దినపత్రిక ఎకనామిక్స్ టైమ్‌లో తిరొగమన రాజకీయాలు అంటూ జగన్ పాలనపై ఏకంగా ఒక ఎడిటోరియల్‌నే రాసేసింది. అందులో జగన్ తీసుకున్న స్టార్టప్ ప్రాజెక్ట్ రద్దు విషయాన్ని కూడా ప్రస్తావించింది. అయితే జగన్ నిర్ణయాలను జాతీయ మీడియా కూడా తప్పు పడుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ ఎడిటోరియల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కాస్త సీరియస్‌గా తీసుకున్న జగన్ దానిని సరిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే జాతీయ మీడియా సలహాదారుడిగా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్‌ను జగన్ నియమించుకున్నప్పటికి జాతీయ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నెగిటివ్ కథనాలు వస్తుండడంతో ఇక మీదట జాతీయ మీడియా వ్యవహారాలను ఐ ప్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిషోర్‌కు అప్పగించాలని జగన్ భావిస్తున్నారట. అంతేకాదు ఈ మేరకు పీకే అండ్ టీంతో జగన్ మరో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇక మీదట జగన్ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ప్రశాంత్ కిషోర్‌ అండ్ టీం చూసుకోనుందని పార్టీలో సమాచారం.