కేసీఆర్, జగన్ సంప్రదింపులు.. బార్డర్‌లో నిలిచిపోయిన విద్యార్థులకు ఎంట్రీ..!

Thursday, March 26th, 2020, 01:40:16 AM IST

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో హైదరాబాద్‌లోని పలు హాస్టళ్ళు నేడు పూర్తిగా మూసివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనితో హైదరాబాద్ పోలీసులు వారికి ఎన్‌వోసీలు ఇచ్చి 24 గంటలలోపు వారి వారి సొంతూళ్ళకు వెళ్ళేందుకు అనుమతినిచ్చారు. అయితే ఇలా ఎన్‌వోసీలు తీసుకుని వెళ్ళిన ఏపీ విద్యార్థులను, ఉద్యోగులను ఏపీ పోలీసులు బార్డర్ చెక్‌పోస్ట్ వద్ద నిలిపివేశారు.

అయితే దాదాపు నేడు మధ్యాహ్నం నుంచి విద్యార్థులను అనుమతించకపోవడంతో జగ్గయ్యపేట వద్ద దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే అక్కడ వేలాది మంది విద్యార్థులు గుమ్మిగూడడంతో పరిస్థితులు లాక్‌డౌన్ నియమాలకు భిన్నంగా ఉండడంతో దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లు సంప్రదింపులు జరిపారు. అయితే బార్డర్‌లో నిలిచిన వారిని హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఇక హైదరాబాద్‌ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని, ఇలా చేయడంవల్ల వారికేకాక, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా రిస్క్‌లో పెట్టిన వారు అవుతారని దయచేసి ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ అధికారులు కోరారు.