మహిళలకు సీఎం జగన్ బంఫర్ ఆఫర్.. ఆ రోజు ఫోన్లు కొంటే 10% డిస్కౌంట్..!

Friday, March 5th, 2021, 03:02:21 AM IST


ఈ నెల 8వ తేదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిపై నేడు ఏపీ సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహిళా దినోత్సవం రోజున స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. మహిళా భద్రత, సాధికారితపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని సూచించారు. దిశ చట్టంపై కాలేజీల్లో ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయాలని, హోర్డింగుల్లో దిశ యాప్‌ సహా అన్ని రకాల వివరాలు ఉంచాలని ఆదేశించారు.

అంతేకాదు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని, దిశ కింద తీసుకుంటున్న చర్యల అవగాహన కోసం విస్తృతంగా ప్రచారం చేయాలని జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ రోజు ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలన్నారు. పోలీసు డిపార్ట్‌మెంటులో పనిచేస్తున్న మహిళలందరికీ ఆరోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించాలని ఆదేశించారు. మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్‌ లీవ్స్‌ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారు.